Friday, October 30, 2015

A request from Mother Earth to Mr. Chandrababu

నాన్నా చంద్రబాబూ,
నేను భూమాతను నాయనా ! నీతో కాస్త మనస్సు విప్పి మాట్లాదామనుకుంటున్నాను. కాస్త ఓపిగ్గా వింటావా నాయనా! మనిషికి అన్నిటికన్నా అత్యవసరం ఆహారం అన్నది నువ్వెగరనిది కాదు. ఆ పట్టెడన్నం కోసమే మనమంతా బ్రతికేది. ఆ తర్వాతే మన ఆశయాలు, సాధనలు. ఆహారం పండించాలంటే చక్కటి సారవంతమైన భూమి, నీరు కావాలన్నది అందరికీ తెలుసు. అందుకే నీ భగీరథ ప్రయత్నాలను జనాలు మెచ్చుకొంటున్నారు. నదుల అనుసంధానమే నీ సంకల్పానికి తొలిమెట్టు అన్నది నిస్సందేహమే! ఇక్కడ గోదావరి నుండి కృష్ణా డెల్టాకు నీళ్ళందిస్తే, అక్కడ శ్రీశైలం ప్రాజెక్ట్ నుండి కృష్ణా డెల్టా వాటా  నీళ్ళను రాయలసీమకు ఇవ్వాలన్న ఆలోచనకు ఇప్పుడు నీళ్ళు లేక పోవడం ఇబ్బందే. ఈ తరుణంలో ఈ మధ్య పడ్డ వర్షాలతో, కొద్దిగా వచ్చిన వరద నీటితో కొన్ని పంటలయినా పండించ గలిగే అవకాశం, సామర్థ్యం ఒక్క కృష్ణ పరీవాహక ప్రాంతంలోనే ఉందని అనుకోవడం పూర్తిగా సత్యం, సాధ్యం కూడా! ఈ సత్యాన్ని నిన్ను గుర్తించమని నేలతల్లిగా అభ్యర్థిస్తున్నాను. నువ్వనుకుంటున్న అమరావతి రాజధాని ప్రాంతం ఇందులోనే ఉందని వేరుగా చెప్పనవసరం లేదు. రాబోయే కరువుకాలంలో అవసరమైన ధాన్యం, కూరగాయలు, పండ్లు ఇక్కడ నుంచే ఎన్నో వేల కుటుంబాలకు అందించ గలుగుతాయి. ఈ ప్రయత్నంలో ఎంతో మంది రైతులు, రైతుకూలీలు నిమగ్నమై వాళ్ళూ లాభ పడతారనేది వాస్తవమే కదా! కాస్త ఆలోచించు బాబూ! అమరావతిని నువ్వు ఎంచుకున్న దాదాపు ఎనిమిది వేల చదరపు కిల మీటర్ల లోనే కట్టాలన్న నిర్ణయాన్ని కాస్త ప్రక్కన బెట్టి ఆలోచించు నాయనా! వేలాది సంవత్సరాలుగా ఏర్పడ్డ భూమి ఇది! ప్రతి సంవత్సరం వర్షాలు, వరదలూ వచ్చి చక్కని ఒండ్రుమట్టితో ఏర్పడిన భూమి ఇది. నాణ్యమైన పంటలు పండించడానికి అనువైనది ఈ భూమి. ఇరవై, ముప్పై అడుగులలోనే నీరు లభిస్తుంది. రాష్రంలో వేయి అడుగులు తవ్వినా చుక్క నీరు రాని ప్రాంతాలు ఎన్నున్నాయో నీకు తెలియంది కాదు. ఎన్నో పంటలు పండించడానికి అనువైన ఈ నేల బంగారమే అనడం  అతిశయోక్తి కాదు గదా! ఇప్పుడు చుక్కలనంటుతున్న పప్పుల ధరలు, కూరగాయల ధరలు చూసి నీకు భూమి అప్పగించిన వారంతా మరోసారి ఆలోచించుకొని మనస్సులు మార్చుకొని మా భూములు మాకివ్వండి అని అడగక ముందే మళ్ళీ ఆలోచించుకో బాబూ! వేలాది ఎకరాల పంట భూములను రియల్ ఎస్టేట్ లు గా మార్చి బంజరు భూములుగా మిగిల్చిన ఘనత కన్నా అందరికీ ఆహారం అందించే సాధనంగానే ఉంచేయమంటున్నాను. బంగారం లాంటి భూములను నాశనం చేయకు నాయనా!
భూమాతగా అందరికీ ఆహారం అందించాలన్న సదుద్దేశంతో చెప్తున్న ఈ మాటలను వింటావన్న ఆశతో ముగిస్తున్నాను.. 

2 comments:

  1. Sir fantastic....but what we can do...nothing... Even floods are a major cause for amaravathi

    ReplyDelete
  2. Sir fantastic....but what we can do...nothing... Even floods are a major cause for amaravathi

    ReplyDelete