Sunday, August 11, 2019

నిన్న రాత్రే టీవీ 5 పోయిన సంవత్సరం మీరు నిర్వహించిన గురుబ్రహ్మ కార్యక్రమం చూడడం జరిగింది. నేను విశ్వనాథ్ గారి గురించి వ్రాసుకున్న కొన్ని మాటలు మీకు కూడా తెలుపుతున్నాను. చిత్ర సంగీతం వెర్రి తలలు వేసి విజృంభిస్తున్న తరుణంలో , చల్లటి సాయత్రంలో చిరుగాలి కివిరజాజులు తలలూపే విధంగా వీనులవిందుగా అందరికీ వినిపించిన నాదమే ఆ నాటి శంకరాభరణం. కొత్తగా క్యాసెట్ట్లు కొనుక్కొని రెండు వైపులా అవే పాటలను రికార్డింగ్ చేయించుకొని టేపు తెగేదాకా విన్నారంటే అతిశయోక్తి కాదు. సంవత్సరంలో ఒక వారం మాత్రమే తెలుగు సినిమా ఆడించే దిల్ షాద్ టాకీస్ లో ఒక సంవత్సరం ఆడిందంటే విచిత్రం కదా! అప్పటిదాకా అన్ని రకాల పాటలు పాడిన బాలు గొంతులో కర్నాటక సంగీత బాణీలతో చేసిన పాటలను పలికించడం విశ్వనాధ్ గారి గొప్పతనమే. అప్పుడు బాలమురళి లాంటి వారున్నప్పటికీ బాలు చేత పాడించడం సాహసమే. కొన్ని సంవత్స రాల పాటు స్టేజి షోలలో బాలు గారు ఎన్ని సార్లు శంకరాభరణం పాటలు పాడారో ఆయనకీ గుర్తుండక పోవచ్చు. వేటూరి గారి పద విజృంభణఈ సినిమాతోనే మొదలయ్యిందేమో. మంజు భార్గవికి ఈ సినిమా తర్వాత కాబరే డాన్స్ పాత్రలు రాలేదని కూడా విన్నాం. సినిమా సంగీత ప్రపంచం అర్థం పర్థం లేని పాటలతో హోరు సంగీతంతో కొట్టుకు పోతున్నప్పుడు , చక్కటి సంగీతానికి , అంతే గొప్పగా చెప్పుకునే సాహిత్యానికి విడదీయలేని బంధం సృష్టించిన వారు విశ్వనా ధులే! నాట్యానికి సంగీతానికి సాహిత్యానికి ప్రతీక విశ్వనాధుని సృష్టి స్వర్ణకమలం. నాట్యానికి భాష్యం చెప్పిన మనోజ్ఞ చిత్ర కావ్యం. నాట్యం ముగించాక భానుప్రియ కళ్ళల్లోనుంచి నీళ్లు చిప్పిల్లడం ఎవరూ మర్చిపోలేరు. సప్తపది సబ్జెక్టు పూర్తిగా వేరే అయినా నాట్యానికి సంగీతానికి ముడి వేసి మనలను బంధించిన ఘనత విశ్వనాధ్ గారిదే. ఏ కులము నీదంటే గోకులము అన్న పాట కులమతాల పిచ్చిని ఎత్తి చూపించినది గదా.
ఫిలిం డైరెక్టర్ కే. విశ్వనాధ్ గారి బయోగ్రఫీ వ్రాసే ప్రయత్నం మీరు చేస్తే బాగుంటుందేమో అనిపించి ఈ మెసేజ్ పెడుతున్నాను. దానికి పేరు విశ్వనాదం అని పెడితే ఎలా ఉంటుంది? విశ్వనాధ్ గారి సినిమా ప్రయాణంలో వారితో బాటు ఎందరో మహానుభావులు కూడా ఉన్నారు. వారందరినీ గురించి కూడా ఎంతో వ్రాయ వచ్చు. ఆలోచించి చూడండి? బయోగ్రఫీ అనడం సరి కాదేమో. ఆయన సెంటర్ అఫ్ సబ్జెక్టు అయినా వారి సినిమా రంగ జీవితంతో ముడిపడి వారి సినిమాలు ఉజ్వల నభూతో నభవిష్యతి అనే విధంగా తయారవడానికి అన్ని కళల తోడ్పాటు నందించిన అందరు మహానీయులను గుర్తుకు తెచ్చుకునే విధంగా ఒక మహత్తర పుస్తకంగా ఉండాలి- విశ్వనాదం

No comments:

Post a Comment