Sunday, August 30, 2015

సింగపూర్ లాంటి రాజధాని అవసరమా ?

అయ్యా చంద్ర బాబు నాయుడు గారూ,
 ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్న ఆర్ధిక పరిణామాలను మనం బేరీజు వేసుకుంటే మనకు సింగపూర్ లాంటి రాజధాని అవసరమా అని ఆలోచించండి. దాదాపు ఇరవై ఏళ్ల పాటు సూపర్ స్పీడులో పరిగెత్తిన చైనా ఒక్కసారి కుదేలై ఏం చేయాలో తెలీక దిక్కులు చూస్తోంది. అప్పు చేసి పప్పు కూడు అన్న చందాన కాలం గడిపిన గ్రీసు దేశం ఇప్పుడెలా ఉందో మనమందరం చూస్తున్నాం. చమురు  ధరలు ఆకాశాన్నంటుతున్న రోజుల్లో వచ్చి పడ్డ సంపద అంతా ఆవిరయ్యే పరిస్థితిని ఎదుర్కోబోతోంది సాదీ అరేబియా అని అందరికీ తెలుసు.
ఇక నిర్మాణాల వైపు చూద్దాం. చైనాలో ఆరు లక్షల అపార్ట్ మెంట్లు కాళీగా పడున్నాయన్న విషయం మీకు తెలీదా? అంత దాక ఎందుకు మన నగరాలలోనే ఎన్ని వేల అపార్ట్ మెంట్ లు అమ్ముడు పోక పడున్నాయో మీకు తెలీదా? ఒక్క అహమదాబాద్ లోనే నలభై రెండు వేల అపార్ట్ మెంట్ లు ఇంకా అమ్ముడు పోలేదు. దాంట్లో పన్నెండు వేలు మూడేళ్ళుగా కాళీగా ఉన్నాయి. మన దేశంలో ఎన్ని షాపింగ్ మాల్స్ లో షాప్స్ కాళీగా ఉన్నాయో మీకు తెలీదా? వాటిని ఏదైనా చిన్న ఆఫీసులకు అద్దె కు ఇద్దామన్న ఆలోచనలో వాటి ఓనర్స్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఆన్ లైన్ల దెబ్బకు పెద్ద పెద్ద షాప్స్ లోని వ్యాపారాలే దెబ్బ తింటున్నాయన్న విషయం మీకు తెలుసు కదా! మయన్మార్ దేశంలో ఎనిమిది ఏళ్లుగా నూతన రాజధాని లో ఎవరూ ఉండడం లేదన్న సంగతి మీకు తెలుసు కదా!
ఐటీ రంగంలో వచ్చిన మార్పులు అంతా ఇంతా కాదు. లాభాలు తగ్గిపోతూ కొత్త ఉద్యోగుల అవసరం కూడా తగ్గి పోతోంది. దాదాపు ప్రతి రంగానికి అవసరమైన సాఫ్ట్ వేర్లు తయారయి ఉపయోగంలో ఉన్నాయి. వర్క్ ఫ్రమ్  హోం దిశగా కంపెనీలు ఆలోచిస్తున్నాయి. లాప్ టాప్ లు  , టాబ్స్ వచ్చాక  విశాలమైన ఆఫీసుల అవసరం తగ్గింది. బాబు గారూ, మళ్ళీ మళ్ళీ ఆలోచించండి. మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత ఒలకబోసుకున్నట్లు చక్కగా పంటలు పండుతున్న భూములను మీరు ఎందుకు పణంగా పెడుతున్నారో అర్థం కావడం లేదు. రాష్ట్రంలో ఆర్ధిక భారాలతో రోజు వారీ ఖర్చులకే డబ్బులు లేని మీరు ఉట్టి కెగర లేనమ్మ స్వర్గానికెగురుతుందట అనే సామెతను నిజం చేయకండి !  
http://www.bbc.com/news/magazine-19049254
http://www.vice.com/en_uk/read/no-one-lives-in-burmas-capital-city
http://timesofindia.indiatimes.com/city/ahmedabad/42000-houses-in-Ahmedabad-have-no-takers-Study/articleshow/48280016.cms