Monday, March 28, 2016

అయ్యా చంద్రబాబునాయుడు గారూ,మళ్ళీ ఒకసారి ఆలోచించండి !

అయ్యా చంద్రబాబునాయుడు గారూ,
మీరు స్వాతంత్ర దినోత్సవం నాడు మన ప్రధాన మంత్రి గారు ఎర్రకోట సాక్షిగా చేసిన ఉపన్యాసం మీరు వినే ఉంటారనుకుంటాను. వ్యవసాయం గురించి మాట్లాడుతూ రైతు సంక్షేమం గురించి మనం ఆలోచించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పడం మీరు వినే ఉంటారు. మీరు ఈ దిశలోనే కష్ట పడుతున్నారన్నది అందరూ ఎరిగిన సత్యమే. మీరు పట్టిసీమలో గోదావరి నీళ్ళు పట్టి రాయలసీమకు కృష్ణ నీరు అందించాల్సిన మీ సంకల్పం అభినందనీయం.
గత కొన్ని సంవత్సరాలుగా వర్షం సకాలంలో కురిసి, గోదావరి మరియు కృష్ణ  నదులలో నీళ్ళు ఎక్కువై   సముద్రంలో కలవడం చూశాం. ఈ నేపధ్యంలో మీరు చేస్తున్న పట్టిసీమ ప్రయోగం అపురూపం. ఈ సంవత్సరం ఆరంభంలో అక్కడక్కడా వానలు కురిసినా, ఇప్పటివరకు పెద్దగా వానలు కురవకపోవడం, సాగర్ మరియు శ్రీశైలం డాములు నిండకపోవడం అన్నది ఇటీవలి చరిత్రలోనే లేదన్నది అందరూ అంగీకరించాల్సిన విషయం.
ఇక అసలు విషయానికి వస్తాను. మబ్బుల్లో  నీళ్ళు చూసి ముంతలోని నీళ్ళు ఒలక బోసింది ఒకావిడ అనే సామెత వినే ఉంటారు మీరు. నీళ్ళకు ఎంత కటకట వచ్చినా నూతన రాజధాని ప్రాంతంలో ఉన్న సాగు భూముల్లో పంటలు పండుతాయి. రెండు మూడు జిల్లాల అవసరాలను తీరుస్తాయి. ఇది ఎవరూ కాదనలేని  పరమ సత్యం.
మరొక్క సారి రాజధాని నిర్ణయాన్ని పునరాలోచించమని మిమ్మల్ని కోరుతున్నాను. మనిషికి ఆహారం తర్వాతే ఏ అవసరమైనా. చెట్టుకిందైనా కూర్చొని పనిచేస్తామన్న వాళ్ళు విధిస్తున్న షరతులు మీకు ఆశ్చర్యంగా ఉంది కదా!
రేపు కాబోయే సింగపూర్ నగరంలో వీళ్ళను భరించాలంటే వీలవుతుందా? మీ దగ్గర రెవిన్యూ ప్లానింగ్ ఉందా?
సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ రాబోయే రోజుల్లో ఇప్పుడిస్తున్నంత టాక్సు మనీ ఇవ్వగలుగుతుందని అనుకుందాం. ఒకవేళ ఇవ్వలేకపోతే అంత టాక్సులు ఇవ్వగలిగే ఇండస్ట్రీలు ఉన్నాయా?
శివరామకృష్ణన్ కమిటీ  అన్ని విషయాలను పరిశీలించిన తర్వాతే రిపోర్ట్ ఇస్తే దాన్ని మీరు బుట్ట దాఖలు చేసారు కదా! మీరు తీసుకున్న ముప్పై వేల ఎకరాలతో బాటు ఇంకా వేలాది ఎకరాలు రియల్ ఎస్టేట్లుగా  మారుతున్నాయన్న విషయం మీకు తెలీదా? దీని వల్ల  ఎలాంటి నష్టాలు ఏర్పడతాయన్న అంశాలను మీరు  పరిశీలించారా ? ఫాస్ట్ ఫార్వర్డ్ పద్ధతిలో కాకుండా కాస్త కామరాజ్ గారిలా ఆలోచించి చూడండి. 
మళ్ళీ ఒకసారి ఆలోచించండి !

జ్ఞాపకాలు

ప్రతి మనిషికీ  జ్ఞాపకాలు రెండు రకాలుగా ఉంటాయి . కొన్నేమో తీపిగుర్తులై కలకాలం తలుచుకున్నప్పుడల్లా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. రెండో రకం కురుపులై మనస్సులోంచి వెళ్ళిపోకుండా ఉండి పోతాయి. ఏమైనా జీవితాన్ని బొమ్మ బొరుసూ అనుకుంటూ గడిపేయడం విచిత్రం కదా!