Friday, August 7, 2009

మా తాత గారు మరణించినప్పుడు మా నాన్నగారుశిరాకి (శివరామకృష్ణ) వ్రాసినది.

ఒక మహోన్నత జీవితమే ముగిసెనో ఈ మంటలలో
ఒక కరుణార్ద్ర హృదయమే కరగెనో ఈ కాలెడి చితిలో
ఒక ధీరచిత్తుని ఆశయాలే అడుగంటెనో ఈ క్షితిలో

దేవుడు ఎటులుండునో ఎరుంగము మేము
వెలసిన వేయి ఆలయాలలోనో, పొగచూరిన కటిక రాతి రూపాలలోనో
కాని కన్నతండ్రివి నీవు, మాకు కన్పించిన దైవానివి నీవు.

పెరిగితిమి పెద్దలై కాఠిన్యం ఎరుగని నీ కనుసన్నలలో
నేర్చితిమి విద్యాబుద్ధులు నీ చేయూతలలో నిలద్రొక్కి.
నీతిపథములో నడచితిమి నీ కాలి జాడలలో.
నీ ఆశలే మా ఆశయాలు, నీ భావములే మా బాటలు.
కనుల నీరు క్రమ్మంగ కరగిన చిత్తములో ఉద్భవించెను ఈ ఊహలు.

లేవిక నీవు మాకిక నీ భౌతిక రూపాన
కాని వున్నావు నీవు నీ విశ్వరూపాన.
అరుణ సంధ్యా కాంతియే నీ మేనిచ్చాయయై
కొలనుల కలువలే నీ కనులై
నీలిగిరుల హిమమకుటమే నీ నిర్మల భావాలై.

No comments:

Post a Comment