Friday, August 22, 2014

The new capital of Andhra Pradesh

నూతన ఆంద్ర ప్రదేశ్ క్రొత్త రాజధాని గురించి ముఖ్యమంత్రి నుంచి సామాన్య ప్రజానీకం వరకు విపరీతంగా చర్చించు కోవడం జరుగుతూ ఉంది. కాబోయే రాజధాని అందరికీ సమాన దూరంలో ఉండాలని, అన్ని రకాల ప్రయాణ సౌకర్యాల ద్వారా చేరుకొనే వీలు ఉండాలని అనుకోవడంలో తప్పులేదు.
రాజధాని నిర్మించాలంటే భూమి అవసరము. నీరు లాంటి ఇతర వనరులు కూడా అవసరమే. కాని సాగులో ఉన్న భూమిని నిర్మాణాలకు ఉపయోగించడం పూర్తిగా ఆలోచించ వలసిన విషయం. ముఖ్యంగా కోస్తా జిల్లాలలోని సాగు భూములు అత్యంత సారవంత మైనవి. ఇప్పటికే జనాభా పెరగడంతో చాలా పట్టణాలలో సాగు భూములు  ఇళ్ళ ప్లాట్లుగా మారి పోయాయి. ఇప్పటికే రాజధాని ఊహలతో గుంటూరు, విజయవాడ పట్టణాల చుట్టూ ఉన్న వందల ఎకరాలు ప్లాట్లుగా మారిపోతున్నాయని వింటున్నాము. ఒక్కసారి వెనక్కు వెళ్తే శంషాబాదు మరియు దేవనహళ్లి ప్రాంతాలలో ఎయిర్ పోర్ట్ల  పేరుతో ఎన్నో వందల ఎకరాలు ప్లాట్లుగా మారి బీళ్లుగా పడి  ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. చెవులు హోరెత్తి పోయేటట్లు ఎయిర్ పోర్ట్ చుట్టూ వేలాది ఇళ్ళు అవసరమవుతుందని ఆ రోజు అందరూ జోస్యం చెప్పారు. చివరికీ సాగులో ఉన్న వందల ఎకరాలు బీళ్లుగా మారడం, తత్ఫలితంగా హైదరాబాదు మరియు బెంగళూరు నగరాల అవసరార్థం వచ్చే కూరగాయలు మరెంతో దూరం నుంచి రావలసి వస్తోంది. వాటి ధరలు పెరగడానికి కొద్ది మంది అత్యాశే కారణం. ఆ ఆశకు అందరూ మూల్యం చెల్లించుకోవలసివస్తోంది. 
తరతరాలుగా చక్కగా వ్యవసాయం చేసుకొనే రైతులు ఒక్క సారిగా వచ్చి పడ్డ డబ్బుతో వాళ్ళు ఏం చేసారో ఆలోచించండి. ఖరీదయిన భవనాలు కొని ఉండ వచ్చు. వారి పిల్లలకు మంచి చదువులు చెప్పించి ఉండవచ్చు. ఘనంగా పెళ్ళిళ్ళు చేసి ఉండ వచ్చు. వారిలో కొంత  మంది నడమంత్రపు సిరితో వివిధ వ్యసనాలకు లోనై బికారులుగా మారినట్లు కూడా విన్నాము. అంతే గాని వారెవ్వరూ మరోచోటికి వెళ్లి వ్యవసాయం చేసినట్లు వినలేదు. ఫలితం మంచి రైతులను పోగొట్టుకున్నామన్నది ఎవరూ  కాదనలేని నిజం.
కాబట్టి ప్రజా ప్రతినిధులు అందరూ సాగులో లేని విస్తారంగా ఉన్న ప్రభుత్వ భూములలో మాత్రమే రాజధాని ఏర్పాటు చేసుకోవడం గురించి ఆలోచించి నిర్ణయం తీసుకొవాలి. ఆ చుట్టూ ప్రజలు ఇళ్ళు కట్టుకోవడానికి అనువుగా సాగులో లేని భూములు దొరికేటట్లు వీలు ఉండాలి. భవిష్యత్తులో రాజధాని పెరిగినా భూమి లోటు రాకూడదు. ఇతర వనరులు, ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడం అంతా మనచేతిలో ఉంది. పైపు లైన్ల ద్వారా నీళ్ళు తెచ్చుకో వచ్చు . రోడ్లు వేసుకోవచ్చు. ఇవన్నీ ఒక్క రోజులో సాధ్యం కాకపోయినా కాలక్రమేణా ఏర్పాటు చెసుకొదగ్గవి.
అందరూ ఆలోచించండి!  కోస్తా జిల్లాలలో ఉన్న బంగారంలాంటి సాగు భూములను కాపాడుకుందాం.. 


1 comment:

  1. I fully agree with you.I have already written about this in my blog.

    ReplyDelete