Monday, September 29, 2014

తెలుగు తల్లికి, తెలంగాణా తల్లికి తేడా

తెలుగు తల్లికి, తెలంగాణా తల్లికి తేడా తెలియని వారికి తలియ చెప్పాలనే నా ఈ ప్రయత్నం. 
తెలుగు ఒక భాష , తెలంగాణా ఒక ప్రాంతం.
తెలుగు భాషకు తల్లి తెలుగు తల్లి.
తెలంగాణా ప్రాంతానికి తల్లి తెలంగాణా తల్లి.
తెలుగు మాట్లాడే వారు ముంబైలో ఉన్నా, ములకనూరులో ఉన్నా, ముదినేపల్లి లో ఉన్నా, ముల్బాగల్ లో ఉన్నా, మదురైలో ఉన్నా వారందరి భాషా తల్లి తెలుగు తల్లే! ఇక వారున్న ప్రాంతాన్ని బట్టి ఆంధ్ర మాత అనో, తమిళ్ సెల్వి అనోప్రాంత మాత స్వరూపాన్ని గౌరవిస్తారు. అలాగే తెలంగాణలో ఉన్న ఏ భాష మాట్లాడే వారైన తెలంగాణా తల్లిని గౌరవించాలిసిందే. 
ఈ సున్నిత తేడాను గమనించి భాషా మాతను, తాముందే ప్రాంత మాతను అంటే ఇరువురినీ గౌరవిస్తే మంచిది.

Friday, September 26, 2014

చంద్రబాబుకు ఒక విన్నపము

కొత్త రాజధాని అంటూ హోరేత్తిస్తున్న చంద్రబాబుకు, ఆయన చుట్టూ ఉన్న మంత్రులకు ఒక విన్నపము.
కేవలం పదమూడు జిల్లాల పరిపాలనకు అవసరమైన రాజధాని ఏర్పాటు చేసుకోవడానికి ఇంత రాద్దాంతమెందుకు? కావలసిందల్లా ఒక అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్ట్ మరియు కొన్ని ముఖ్యమైన ఆఫీసులు తప్ప ఇంకేం కావాలి? ప్రతి జిల్లాలోని ప్రతి మనిషి రోజూ రాజధానికి రావలసిఉంటుంది అన్నట్లు లెక్కలు వేసి అందరికీ సమాన దూరంలో ఉండాలి అంటూ అందుకు అనువైనది విజయవాడ ఒక్కటే అంటూ ముక్త కంఠంతో గొంతెత్తి పాడటం ఆపేసి కాస్త స్థిమితంగా ఆలోచించండి!
అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలు అందుబాటులో ఉన్న ఈ యుగంలో మనిషి కదలకుండా అన్ని పనులు చేసుకుంటున్న వెసులుబాటు ఉంటున్న ఈ రోజుల్లో ఇంకా సమాన దూరం అనే సిద్ధాంతం  అవసరం లేదు.
రాజధానికి భూసేకరణ అంటూ రైతులను మభ్యపెడతారెందుకు? ఆది మానవ యుగం నుంచి తరతరాలుగా వస్తున్నది వ్యవసాయం. కూడు, గుడ్డ, గూడు క్రమంలో మొట్టమొదటి కూడు మనందరికీ అందించేది రైతులే ! ఎన్నో తరాలుగా చేస్తున్న ఆ వృత్తిని వారు వదలిపెట్టి మరో వృత్తినో, వ్యాపకాన్నో చేపట్ట గాలుగుతారా? కోట్ల రూపాయలు వస్తాయన్న ఆశలతో వారిని ముంచెత్తి  బంగారంలాంటి భూములను కాంక్రీటు అరణ్యాలుగా మార్చదలచారా?
భారత దేశంలోనే అత్యంత సారవంతమైన భూభాగాలలో కోస్తా భూములు ఒకటని మీకు వేరుగా చెప్పనక్కర లేదు. నీటి వసతులు, చక్కటి వాతావరణం, వరదల ద్వారా వచ్చే ఒండ్రు- వీటన్నిటినీ
మించి వ్యవసాయంలో నిష్ణాతులైన రైతులు పండిస్తున్న పంటలను గురించి ఆలోచించండి. రాబోయే ఎన్నో తరాలు వ్యవసాయం చేసి పంటలు పండించాల్సిఉంది. ఆహారం మీద ఖర్చులు పెరుగుతున్న ఈ తరుణంలో కోస్తా భూముల మీద కన్నేసి కోట్లు దండుకోవాలనుకునే వారిని కట్టడి చేసి సాగు భూములను కాపాడండి. భవిష్యత్తులో రాబోయే వారికి తిండి పెట్టండి.

Wednesday, September 3, 2014

Bapu bomma







శివ ధనుర్భంగము గావించి  వరమాల వేయించుకొని
 వివాహమాడినాడు  సీతను ఆ రామచంద్రుడు !

రాజధాని రాజకీయాలు

భూ బకాసురులకు అనుగుణంగా  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించాలనుకోవడం చాలా బాధాకరంగా వుంది. బంగారం పండించే రైతుల వద్ద నుండి ఏదో రకంగా భూములు లాక్కొని కాంక్రీటు అరణ్యాలు సృష్టించాలనుకోవడంలో ఏం న్యాయం వుంది? వ్యవసాయాధారిత పరిశ్రమల  స్థాపనకు భూములు వాడుకోవడంలో అర్థం వుంటుంది. భూములు అమ్ముకున్న రైతులు వారి జీవన విధానాన్ని ఎలా మార్చుకుంటారు? వచ్చిన నడమంత్రపు సిరి వారిని ఎటువంటి ఇబ్బందులకు లోను చేస్తుందో? అసలు ఇప్పుడు ప్రభుత్వం అనుకుంటున్న కృష్ణా, గుంటూరు జిల్లాలలో కాకుండా దొనకొండ లాంటి ప్రదేశంలో కావలసిన విధంగా రాజధాని నిర్మాణాన్ని చేపట్టి కావలసిన సౌకర్యాలను కాలక్రమేణా ఏర్పాటు చేసుకోవడం మంచిది. కొత్త ప్రాంతాలు కూడా అభివృధ్హి చెందడానికి ఇది ఎంతో తోడ్పడుతుంది.