Sunday, May 31, 2009

చంద్రబాబు గారూ !

ఇటేవల జరిగిన ఎన్నికలలో మీ తెలుగుదేశం ఓడిపోవడంలో మీ తప్పొప్పులు ఎన్నున్నాయో అన్న విషయాన్ని పూర్తిగావిస్మరించి, EVM మిషన్లు సరిగ్గా పనిచేయలేదని, ఓటర్లు సరిగ్గా ఓట్లు వేయలేదని, ప్రజారాజ్యం మరియు లోకసత్తాపార్టీల వల్ల మీ ఓట్లు చీలిపోయాయని వాపోవడం చాలా హాస్యాస్పదంగా వుంది.
అసెంబ్లీలో మీ సంఖ్య పెరగలేదా? దీనికి కారణం మీకు ఓట్లు వేసినవారా? లేదా EVM మాయ అంటారా! కాంగ్రెసునుపెద్ద బూచిగా చూపించి టిఆర్ఎస్ ను, కమ్యూనిస్టులను కూడగట్టుకుని మీ సీట్లు పెంచుకుంది వాస్తవం కాదా? ఇప్పుడువాళ్లు పనిచేయలేదనో, కాంగ్రెస్సు వోట్లను సరిగ్గా చీల్చలేక పోయారనో చెబుతున్నారు.
బాలకృష్ణతో తొడలు కొట్టించినంత మాత్రానో, జూనియర్ ఎన్టీఆర్ తో కుప్పిగంతులు వేయించినంత మాత్రానో ఓట్లు రాలవుఅన్న విషయాన్ని మీరిప్పటికయినా గ్రహించండి.
అప్పుడే మీ ప్రతాపం కొత్త పార్టీలైన ప్రజారాజ్యం మరియు లోకసత్తాల మీద కనబడుతోంది. ముందు చిన్న శత్రువుల పనిబడితే, తర్వాత ఏకైక పెద్ద శత్రువు సంగతి చూసుకోవచ్చు అనుకుంటున్నారేమో! మీ శత్రువులందరూ ఏకమవడానికిమీ చర్యలు నాంది అవుతుందేమో కాస్త ఆలోచించండి!

సామాన్యుడు (ఎప్పుడో వ్రాసుకున్నది )

సామాన్య మానవుడా
నువ్వెలా వుంటావో నాకు తెలీదు.
పట్టెడన్నం కూడా నీకు రోజూ దొరకదని అన్నారు కొందరు
గోచీ గుడ్డ కూడా లేని వాడవని అన్నారు మరికొందరు.
పక్షులకైనా గూళ్ళు వుంటాయి కాని
నీకు అది కూడా లేదన్నారు.
గాంధీ టోపీ పెట్టుకుని నీ పేరు చెప్పుకుని నీకు వేసారు టోపీ.
ఎర్ర చొక్కాలు వేసుకుని విప్లవమంటూ అరిచి నిన్ను వెర్రివాన్నిచేసారు.
పసుపు చొక్కాలు వేసుకుంటూ నీ బ్రతుకు పచ్చగా చేస్తామంటూ
కాషాయ వస్త్రాల నాయకుడి శిష్యులు బయలు దేరారురా ఇప్పుడు.
ఈస్టమన్ రంగుల చిత్రంలాంటి రాజకీయాలురా ఇవి
నీ పేరు చెప్పి తింటారు పంచభక్ష్య పరమాన్నాలు
వేస్తారు ఇంకా రంగుల చొక్కాలు
కడతారు మేడలపై మేడలు.
ఇంతైనా ఇన్నైనా నీకు లేవురా
కూడు, గుడ్డా , గూడు.

Friday, May 29, 2009

పాపం చంద్రబాబు.

ఆడలేక మద్దెల ఓటిదన్నట్లు చంద్రబాబు ఈవీఎం మిషన్లు బదులు బాలట్ పెట్టెలు వాడాలని సెలవివ్వడం ఆశ్చర్యంగా వుంది. ఏవో గణాంకాలు వల్లెవేస్తూ ఓటర్లు ఏదో తప్పు చేసెసినట్లు లేకపోతే తామే గెలిచివుండే వారమని చెప్పడం విచిత్రంగా వుంది. ఏం, తెలుగుదేశం తప్పేమీ లేదా?
అయినా హైటెక్ సీఎం గా పేరు తెచ్చుకున్న చంద్రబాబు కావాలంటే ఈవిఎంలో వుండే ఇబ్బందులను అధిగమించేటట్లు ఈసీ
ఐఎల్ వారికి సలహాలు ఇవ్వచ్చుగా. అంతేగాని తిరోగమన ఆలోచనలకు తావిస్తూ, విమర్శలు చేయడం మంచిది గాదు. తన మైండ్సెట్ మార్చుకోవాలేమో!

Thursday, May 28, 2009

వినాలనుంది - Listeners' choice - రేడియో స్పందన

వినాలనుంది - Listeners' choice

ఏమిటి ప్రియా? ఏం చేస్తున్నావు?

రారా సుష్మా! వినాలనుంది ప్రోగ్రాము రికార్డింగ్ చేస్తున్నాను. కాస్త పాటలు తగ్గుతున్నై . ఏం చేద్దామని ఆలోచిస్తున్నాను.

అంత ఆలోచన ఎందుకమ్మా? నేను చెప్పినట్టు విను. ఆ వరంగల్ సంగీత , సతీష్ , పవిత్ర , ప్రేమకుమార్ల పేరు చెప్పి ఎన్నెన్నో జన్మల అనుబంధం, ఇంకో రెండు పాటలు ఆ చివర, ఈ చివర వేసేస్తే సరిపోతుంది .ఇంకా తగ్గిందనుకో నా పేరు చెప్పి ఏదో పాట వేసి నీకుడేడికేటు చేసుకో .

అంతేనంటావా సుష్మా?అంతే ప్రియా . ఇక ఆలోచించకు . కానిచ్చేయ్ . అంతా వినేవాళ్ళ ఖర్మ . మనకు ఎందుకమ్మ బాధ ?

Tuesday, May 26, 2009

అయ్యా చిరంజీవి గారూ,

మీ ప్రజా రాజ్యం వెబ్ సైటులో ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాల గురించి ఒక్క ముక్క కూడా లేదు. ఇలాగైతే ఎలాగండి? మీకు కొన్ని వేల సంఖ్యలో వుత్తరాలు వచ్చి వుంటాయి గదా? వీటిలో నిర్మాణాత్మకంగా వున్నవాటిని ప్రచురిస్తూ, వాటిపై మీ సభ్యులు మరియు కార్యకర్తల అభిప్రాయాలను చెప్పమంటే బాగుంటుంది కదండీ? లేకపోతే మీ ప్రజారాజ్యం వెబ్ సైటు చచ్చుబడి పోతుంది జాగ్రత్త! ప్రజాసమస్యల పట్ల మీ కార్యకర్తల అభిప్రాయాలను ఎప్పటికప్పుడు అడుగుతూ వుండండి. అసెంబ్లీలో మీరు మాట్లాడ్డానికి ఇవి చాలా దోహదపడతాయండి.
ఇట్లు,
భవదీయుడు,
బాపూజీ

Monday, May 18, 2009

యువకులూ జాగ్రత్త!

యువతకు పెద్ద పీట వేస్తాం! అని ప్రతి పార్టీ ఎలక్షన్ల ముందు యువకులను ఊరించడం పరిపాటి అయిపోయింది. వీధుల్లో జెండాలు పట్టుకుని తిరగడానికి, ఇంటింటికీ వెళ్లడానికి దేహశక్తి వున్నయువకుల అవసరం వయస్సు పై బడ్డ నాయకులకు ఎంతో వుంది. యువకుల్లో ఆశావాదం ఎక్కువగా వుంటుంది కాబట్టి వాళ్లకు ఈ ముసలి నాయకుల మాటలు చాలా ఇంపుగా, నిజాయితీగా అన్పిస్తాయి. కాని తీరా, ఎలక్షన్లు వచ్చాక జరిగిదేమిటి? నాయకుల పుత్రరత్నాలు తెరమీదకు వస్తారు. లేదా కొన్ని అవసరాల వల్ల కొంత మందికి టికెట్లు ఇవ్వాల్సి వచ్చిందని, గెలుపు ప్రధానం కాబట్టి కాస్త సర్దుబాటు అవసరమైందని చెప్పడం జరుగుతుంది.
ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ అవకాశవాదులు ఎంతో మంది పార్టీల్లో చేరిపోతారు. అప్పుడు పార్టీకి వారి అంగబలం, ధనబలం అవసరం కదా! కాబట్టి, యువకులూ జాగ్రత్త!

Saturday, May 16, 2009

చిరంజీవిగారూ!

నిన్న ఎలక్షన్ల ఫలితాలను విశ్లేషిస్తూ చిరంజీవి సమయం సరిపోలేదు అని ఓ మాట అన్నారు? రాజకీయాల్లోకి రావాలా వద్దా అంటూ కాలాయాపన చేసిందెవరు? ఏ పేరు పెట్టాలా అని రోజులు గడిపింది ఎవరు? మీటింగ్ ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తూ, వలస పక్షులకోసం ఎదురుచూస్తూ, మీటింగులకు వచ్చే వాళ్ళంతా వోట్లేస్తారన్న భ్రమలో వుండిదెవరు?
అయ్యా, రామారావు రాజకీయాల్లోకి వచ్చిన నాటి పరిస్థితి వేరు అని అందరు చెప్తున్నా విన్నారా? మీరు చేసిన సర్వేలు నిజాన్ని మీకు చెప్పాయా? మేధావుల మాటలు ప్రక్కన బెడితే ఏం జరుగుతుందో మీరే కాదు, కేసీయార్ సైతం ఇంకా నేర్చుకో లేదు. వెళ్ళిపోయిన వారి మీద అభాండాలు వేసారు గాని వాళ్ళు చేసిన విమర్శలను పట్టించుకున్నారా? వుట్టికెగరలేనమ్మ స్వర్గానికెగురుతానన్న సామెత వూరకే పుట్టలేదు మరి! ఇప్పుడైనా ఎవరు మనవారు అని ఆలోచించండి.
విశ్లేషణలు అని మరీ కాలయాపన చేయకండి?

Thursday, May 14, 2009

కాలాతీతులు


కాకతీయుల ప్రాభవానికి,
కాలగమనానికి సాక్షులం.
ముష్కరుల దాడికి
మోచేతులు పోయినా, మోకాళ్ళు పోయినా
జీవిస్తున్నాము జడవక
నాటి శిల్పులు చెక్కిన శిల్పాలమై.

Wednesday, May 13, 2009

ఏమని వ్రాయను? -రేడియో స్పందన

గజిబిజిగా గమ్మతుగా మాట్లాడుతూ
మంచిపాటలు వేస్తూ
సుప్రభాతం చెప్పే సుస్వరాల సుష్మ గారూ!
మీ ప్రియను నేనంటూ
మధుర స్వరంతో
ప్రియరాగాలు అందించే ప్రియా !
నేను నందూను అంటూ
నాన్ స్టాపుగా మాట్లాడుతూ
లేటెస్ట్ పాటలు వినిపించే నందూ !
మంచి పాటలే కాదు
మంచి మాటలు కూడా వినండంటూ
సాహితీ కుసుమాలను చక్కటి వ్యాఖ్యానంతో
అందిచే మృదుభాషిని మృణాళిని గారూ !
మా శ్రోతల హృదయాల
స్పందనల ప్రతిరూపమే
మీరందరూ మా రేడియో స్పందనలో!


బలే మంచి రోజు! పసందయిన రోజు!


ప్రతి సంవత్సరానికి మూడు వందల అరవై అయిదు లేదా ఆరు రోజులు వుంటాయి. ఇవన్నీ మంచి రోజులే అని నా నమ్మకం.
వాతావరణ పరిస్థితులు అనుకూలించినంత కాలం ఏ రోజయినా మంచి రోజే అవుతుంది కదా! పంచాంగం ముందర పెట్టుకుని ఏవో గణిస్తూ, ఫలాన రోజు దివ్యంగా వుందనో, ఇంకో రోజు అసలు బాగా లేదనో కొంత మంది చెప్తుంటారు.
మరి ఆ రోజు రైళ్ళు, బస్సులు, విమానాలు ఎక్కి ఎవరూ ఏ పనికీ వెళ్ళడం లేదా? ఏమీ చూడకుండా కొత్త పనులు మొదలు పెట్టిన వాళ్ళున్నారు. ఇలా అడిగితే వితండ వాదం అంటారు గాని సమాధానం చెప్పరు. తర్కంగానే భావించి జవాబు చెప్పొచ్చుగా. పంచాంగాలను నమ్ముకొని యుద్ధాలలో ఓడిపోయిన రాజులున్నారంటే నమ్మండి. ఈ మధ్య మంచిరోజు చూసుకొని గర్భవతులకు సిజేరియన్ ఆపరేషన్లు చేయించి మంచిరోజున బిడ్డ పుట్టాడు అని మురిసిపోతున్నారు. కృత్రిమంగా మనం చూసిన రోజున పుట్టించిన వాడి జాతకాన్ని ఎలా గణిస్తారు? ఇంతకీ నా అభిప్రాయం ఏ రోజయినా మంచి రోజే. ఏ వేళయినా మంచి సమయమే! ప్రతి రోజును సద్వినియోగం చేసుకోండి. అంతే గాని మంచి రోజు కాదని వృధా చేసుకోకండి.

ఉదయ రాగం

మా ఇంటి వేపచెట్టు మీద రాత్రంతా వేచివుండి
వెలుగు రేకలు ఆకాశంలో విచ్చుకోకముందే
మగత నిద్రలో కలలు కంటున్నా
కర్ణామృతంగా నా చెవుల్లోకి జారే కోయిల కూతలకు
సరిరాదు ఏ ఆనందమూ.
ప్రకృతి ప్రసాదించిన వేకప్ కాల్ ఇదేనేమో!

Tuesday, May 12, 2009

అన్నమయ్య - లక్ష గళ అర్చన

ఎందుకో ఈ ప్రోగ్రాం నిరాశపరిచింది. స్టేజి మీద కూర్చున్న వారి పాట కచ్చేరి అనిపించింది. మరెవ్వరీ గొంతు వినబడకబోవడం ఆశ్చర్యం కదా! గిన్నిస్ వారు మరీ ఫ్రేము కట్టించి సర్టిఫికేటు వెంటనే ఇవ్వడం మాయగా ఉంది. లక్ష మంది వచ్చారన్నది వాస్తవం. పాడారన్నది కేవలం నమ్మకం. అంతా అన్నమయ్య పేరుతో గొప్ప పబ్లిసిటీ స్టంటు. అంతా సిలికాన్ మహత్యం!

భోగి మంటలు

గడచిన భోగి పండగనాడు మా ఉషోదయ అపార్టుమెంటు ఆవరణంలో భోగిమంటల కోసం మా శివశంకర్ గారు పాత తలుపు చెక్కలు ఇచ్చారు. ఆ భోగిమంటలు వేసిన ఆనందంలో వ్రాసుకున్న ఓ చిట్టి కవిత.

శివశంకరుడిచ్చిన దారుముక్కలతో భోగిమంటలు వేయంగ
అగ్నికీలలు శివతాండవమాడంగ
ఉషోదయవాసులు ఊయలలూగంగ
తెచ్చి యిచ్చె సంక్రాంతి లక్ష్మి సకల శుభములు!

మా పెద నాన్న

కొందరికి నాన్నవు నీవు,
మరికొందరికి మర్చిపోలేని పెదనాన్నవు నీవు.

ఓరుగల్లు అంటే అందరికీ గుర్తొచ్చేది కోటగోడలు, శిల్పతోరణాలు.
కాని మాకు గుర్తొచ్చేది రేమింగ్టన్ రాండ్ టైపు మిషను మీద టక టక లాడే నీ వ్రేళ్ళు,
వాటి స్పీడుఅందుకోవాలని పరిగెత్తే నీ ఆలొచనా తరంగాలు.
చెల్లమ్మ మా అమ్మ, నీ సహచరి నీకు తోడుండి
నీ కాన్సరులో కూడా నీకు తోడైంది
మా అందరికీ మరుజన్మలుంటే నీవే కావాలి నాన్నవి, పెదనాన్నవి.

చనిపోయిన వారికి కర్మకాండలు అవసరమా? - 2

....ఈ కర్మకాండలు చేయకపోతే 'ఈ ప్రేతాత్మ' ఇక్కడే తిరుగుతూ వుంటుందని అది బ్రతికున్న మనకు, మన పిల్లలకు మంచిది కాదని నూరి పోస్తారు. మన మధ్యలోనుంచి వెళ్ళిపోయిన మనిషి ప్రేతత్మగా మారి మన చుట్టూ తిరిగితే మనకేమిటి? మనకెలా చెడు జరుగుతుంది? మరణం తర్వాత మనమెవ్వరూ చూడని ఏదో లోకాలకు ఆ ఆత్మ వెళ్లి మన పితృ దేవతలను చేరుకోవాలాట. దీన్ని ఎలా నమ్మాలి? ఎందుకు నమ్మాలి? ఆ ఆత్మ మనకెందుకు చెడు చేస్తుంది?
చనిపోయిన మనుషులు బ్రతికున్న వారి జ్ఞాపకాలలో బ్రతుకుతారు గాని ఎక్కడో ఏదో లోకాలలో మాత్రం కాదు. కర్మకాండలు, శ్రాద్దకర్మల పేర్లతో బ్రతికున్న మనమెందుకు వేలకువేల రూపాయలు ఖర్చు చేయాలి?
జబ్బుతో వున్న మనిషిని ఎంతయినా ఖర్చు పెట్టి కాపాడుకోవడానికి ప్రయత్నం చేయడంలో అర్థం వుంది. ఆ మనిషి బ్రతికి పది కాలాల పాటు ఉండాలని కోరుకోవడంలో అర్థం వుంది. కాని అదే మనిషి దురదృష్టవశాత్తూ చనిపోతే అతన్ని దహనం లేదా ఖననం చేయడం మన బాధ్యత. ఆ తర్వాత కర్మకాండకు అంటూ వేలకు వేలు ఖర్చు చేయడం మూర్ఖత్వం అవుతుంది.

చనిపోయిన వారికి కర్మకాండలు అవసరమా?

మనిషి తనలో వున్న ప్రాణం ఎగిరిపోగానే నిర్జీవమై శవంగా మారిపోతాడు. ఇక అతని ప్రయాణం శ్మశానానికే. అక్కడఅతన్ని పూడ్చి పెట్టడమో లేక కాల్చివేయడమో జరుగుతుంది. ఇది ఇప్పుడు బ్రతికి వున్న మనమందరమూ చూస్తున్ననిజం.
కాని ఇంతటితో కథ అయిపోదు. బ్రతికివున్న వాళ్లకు అసలు కష్టాలు మొదలవుతాయి.
మనిషిలోంచి వెళ్ళిపోయిన 'ఆత్మ' ఇంకా ప్రేతాత్మగా వుంటుందని, తాను ఇన్నాళ్లుగా బ్రతికిన పరిసరాలను విడిచి వెళ్ళక
అక్కడే తిరుగుతూ వుంటుందని, దాన్ని సాగనంపడానికి 'కర్మకాండలు' నిర్వహించాలని నిర్వచనాలు చెప్తారు మనచుట్టూ వున్న వారు.

మిగతా తర్వాత...