విశ్వాసం - వివేచన 1963
మీరు సాక్షి ఆదివారము సంచికలో వ్రాసే మీ అనుభవాలను చాలా కాలం నుండి చదువుతున్నాను. ముఖ్యంగా మీ ఆంధ్ర ప్రభ మరియు ఆకాశవాణి అనుభవాలను కళ్ళకు కట్టినట్టుగా వివరిస్తుంటే చాలా ఆనందంగా చదివే వాళ్ళల్లో నేను ఒకణ్ణి. ఈ ఆదివారము మీరు వ్రాసింది పూర్తిగా అసంభద్దంగాను, అనాలోచితంగాను వ్రాసారేమో అన్పించింది.
సైన్సు పరంగా మనం ఎంతో అభివృద్ధి సాధించామన్నది నిర్వివాదాంశాం అనడంలో అతిశయోక్తి లేదు. దైవ ప్రేరేపణతోనో లేక ఏ దేవుడో కలలో కన్పించో ఏదో ఒక వస్తువును ఎలా తయారు చెయ్యాలో ఎవరికీ చెప్పిన వైనం ఎక్కడా లేదు. కాకపోతే తమ వృత్తిపరంగా వారు చేసే పనులకు వారి దైవచింతనలకు లంకె వేయడం హాస్యాస్పదంగా వుంది. నిజ నిరూపణ నిమిత్తం పరిశోధనలు మళ్ళీ మళ్ళీ చేస్తుంటారు. నీరు జీరో డిగ్రీల దగ్గర ఘనీభవిస్తుందన్న విషయం చాల పాతదే అయినప్పటికీ ఎందుకు పరిశోధనలు మళ్ళీ మళ్ళీ అదే విషయం మీద చేస్తుంటారు?
వివేచన కన్నా విశ్వాసం గొప్పది అని చెప్పే ప్రయత్నం చేసారు.ఎలాగో చెప్పండి? సిరా వొలికితే జిల్లెళ్ళమూడి అమ్మవారు కనబడ్డారని వ్రాసారు.మీరెప్పుడైనా మబ్బుల వంక చూసారంటే మీకు కావాల్సిన రూపాలన్నీ కనబడతాయి. వంకాయ కొస్తే వినాయకుడి రూపమో అల్లా అనే అక్షరాలు కనబడితే వాటిని వెంటనే నమ్మమంటారా? కేవలం జన్యు వికృతంగా మనం కొట్టి పారేస్తాం కదా!
ఇక పుట్టపర్తి సాయిబాబా గారు చెప్పే కథలేప్పుడైనా కథలే. వాటికి ఆయన జోడించే వేదాంతం విచిత్రంగా వుంటుంది. ఒక పిల్లవాడు పుస్తకం పేజీల మధ్య ఓ పదిరూపాయల నోటు పెట్టి మరిచి పోయి వెళ్లి ఇంకెవరినో అప్పు అడగబోయాడట. ఆ అప్పు తీసుకునే ముందు ఆ నోటు కనబడితే ఆ అబ్బాయి విస్తుబోయాడట. నీతి ఏమంటే నువ్వు దేవుణ్ణి నీలోనే వెతుకు. ఇలాంటివెన్నో మీరు కావాలంటే మీకు నేను వుదహరించగలను.
మనకు లభించిన ఏ ఒక్క పురాతన ఆస్థి పంజరాలు ఏ పురాణాన్ని అయినా నిరూపించ గలదా?