Monday, September 29, 2014

తెలుగు తల్లికి, తెలంగాణా తల్లికి తేడా

తెలుగు తల్లికి, తెలంగాణా తల్లికి తేడా తెలియని వారికి తలియ చెప్పాలనే నా ఈ ప్రయత్నం. 
తెలుగు ఒక భాష , తెలంగాణా ఒక ప్రాంతం.
తెలుగు భాషకు తల్లి తెలుగు తల్లి.
తెలంగాణా ప్రాంతానికి తల్లి తెలంగాణా తల్లి.
తెలుగు మాట్లాడే వారు ముంబైలో ఉన్నా, ములకనూరులో ఉన్నా, ముదినేపల్లి లో ఉన్నా, ముల్బాగల్ లో ఉన్నా, మదురైలో ఉన్నా వారందరి భాషా తల్లి తెలుగు తల్లే! ఇక వారున్న ప్రాంతాన్ని బట్టి ఆంధ్ర మాత అనో, తమిళ్ సెల్వి అనోప్రాంత మాత స్వరూపాన్ని గౌరవిస్తారు. అలాగే తెలంగాణలో ఉన్న ఏ భాష మాట్లాడే వారైన తెలంగాణా తల్లిని గౌరవించాలిసిందే. 
ఈ సున్నిత తేడాను గమనించి భాషా మాతను, తాముందే ప్రాంత మాతను అంటే ఇరువురినీ గౌరవిస్తే మంచిది.

Friday, September 26, 2014

చంద్రబాబుకు ఒక విన్నపము

కొత్త రాజధాని అంటూ హోరేత్తిస్తున్న చంద్రబాబుకు, ఆయన చుట్టూ ఉన్న మంత్రులకు ఒక విన్నపము.
కేవలం పదమూడు జిల్లాల పరిపాలనకు అవసరమైన రాజధాని ఏర్పాటు చేసుకోవడానికి ఇంత రాద్దాంతమెందుకు? కావలసిందల్లా ఒక అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్ట్ మరియు కొన్ని ముఖ్యమైన ఆఫీసులు తప్ప ఇంకేం కావాలి? ప్రతి జిల్లాలోని ప్రతి మనిషి రోజూ రాజధానికి రావలసిఉంటుంది అన్నట్లు లెక్కలు వేసి అందరికీ సమాన దూరంలో ఉండాలి అంటూ అందుకు అనువైనది విజయవాడ ఒక్కటే అంటూ ముక్త కంఠంతో గొంతెత్తి పాడటం ఆపేసి కాస్త స్థిమితంగా ఆలోచించండి!
అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలు అందుబాటులో ఉన్న ఈ యుగంలో మనిషి కదలకుండా అన్ని పనులు చేసుకుంటున్న వెసులుబాటు ఉంటున్న ఈ రోజుల్లో ఇంకా సమాన దూరం అనే సిద్ధాంతం  అవసరం లేదు.
రాజధానికి భూసేకరణ అంటూ రైతులను మభ్యపెడతారెందుకు? ఆది మానవ యుగం నుంచి తరతరాలుగా వస్తున్నది వ్యవసాయం. కూడు, గుడ్డ, గూడు క్రమంలో మొట్టమొదటి కూడు మనందరికీ అందించేది రైతులే ! ఎన్నో తరాలుగా చేస్తున్న ఆ వృత్తిని వారు వదలిపెట్టి మరో వృత్తినో, వ్యాపకాన్నో చేపట్ట గాలుగుతారా? కోట్ల రూపాయలు వస్తాయన్న ఆశలతో వారిని ముంచెత్తి  బంగారంలాంటి భూములను కాంక్రీటు అరణ్యాలుగా మార్చదలచారా?
భారత దేశంలోనే అత్యంత సారవంతమైన భూభాగాలలో కోస్తా భూములు ఒకటని మీకు వేరుగా చెప్పనక్కర లేదు. నీటి వసతులు, చక్కటి వాతావరణం, వరదల ద్వారా వచ్చే ఒండ్రు- వీటన్నిటినీ
మించి వ్యవసాయంలో నిష్ణాతులైన రైతులు పండిస్తున్న పంటలను గురించి ఆలోచించండి. రాబోయే ఎన్నో తరాలు వ్యవసాయం చేసి పంటలు పండించాల్సిఉంది. ఆహారం మీద ఖర్చులు పెరుగుతున్న ఈ తరుణంలో కోస్తా భూముల మీద కన్నేసి కోట్లు దండుకోవాలనుకునే వారిని కట్టడి చేసి సాగు భూములను కాపాడండి. భవిష్యత్తులో రాబోయే వారికి తిండి పెట్టండి.

Wednesday, September 3, 2014

Bapu bomma







శివ ధనుర్భంగము గావించి  వరమాల వేయించుకొని
 వివాహమాడినాడు  సీతను ఆ రామచంద్రుడు !

రాజధాని రాజకీయాలు

భూ బకాసురులకు అనుగుణంగా  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించాలనుకోవడం చాలా బాధాకరంగా వుంది. బంగారం పండించే రైతుల వద్ద నుండి ఏదో రకంగా భూములు లాక్కొని కాంక్రీటు అరణ్యాలు సృష్టించాలనుకోవడంలో ఏం న్యాయం వుంది? వ్యవసాయాధారిత పరిశ్రమల  స్థాపనకు భూములు వాడుకోవడంలో అర్థం వుంటుంది. భూములు అమ్ముకున్న రైతులు వారి జీవన విధానాన్ని ఎలా మార్చుకుంటారు? వచ్చిన నడమంత్రపు సిరి వారిని ఎటువంటి ఇబ్బందులకు లోను చేస్తుందో? అసలు ఇప్పుడు ప్రభుత్వం అనుకుంటున్న కృష్ణా, గుంటూరు జిల్లాలలో కాకుండా దొనకొండ లాంటి ప్రదేశంలో కావలసిన విధంగా రాజధాని నిర్మాణాన్ని చేపట్టి కావలసిన సౌకర్యాలను కాలక్రమేణా ఏర్పాటు చేసుకోవడం మంచిది. కొత్త ప్రాంతాలు కూడా అభివృధ్హి చెందడానికి ఇది ఎంతో తోడ్పడుతుంది.


Friday, August 22, 2014

The new capital of Andhra Pradesh

నూతన ఆంద్ర ప్రదేశ్ క్రొత్త రాజధాని గురించి ముఖ్యమంత్రి నుంచి సామాన్య ప్రజానీకం వరకు విపరీతంగా చర్చించు కోవడం జరుగుతూ ఉంది. కాబోయే రాజధాని అందరికీ సమాన దూరంలో ఉండాలని, అన్ని రకాల ప్రయాణ సౌకర్యాల ద్వారా చేరుకొనే వీలు ఉండాలని అనుకోవడంలో తప్పులేదు.
రాజధాని నిర్మించాలంటే భూమి అవసరము. నీరు లాంటి ఇతర వనరులు కూడా అవసరమే. కాని సాగులో ఉన్న భూమిని నిర్మాణాలకు ఉపయోగించడం పూర్తిగా ఆలోచించ వలసిన విషయం. ముఖ్యంగా కోస్తా జిల్లాలలోని సాగు భూములు అత్యంత సారవంత మైనవి. ఇప్పటికే జనాభా పెరగడంతో చాలా పట్టణాలలో సాగు భూములు  ఇళ్ళ ప్లాట్లుగా మారి పోయాయి. ఇప్పటికే రాజధాని ఊహలతో గుంటూరు, విజయవాడ పట్టణాల చుట్టూ ఉన్న వందల ఎకరాలు ప్లాట్లుగా మారిపోతున్నాయని వింటున్నాము. ఒక్కసారి వెనక్కు వెళ్తే శంషాబాదు మరియు దేవనహళ్లి ప్రాంతాలలో ఎయిర్ పోర్ట్ల  పేరుతో ఎన్నో వందల ఎకరాలు ప్లాట్లుగా మారి బీళ్లుగా పడి  ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. చెవులు హోరెత్తి పోయేటట్లు ఎయిర్ పోర్ట్ చుట్టూ వేలాది ఇళ్ళు అవసరమవుతుందని ఆ రోజు అందరూ జోస్యం చెప్పారు. చివరికీ సాగులో ఉన్న వందల ఎకరాలు బీళ్లుగా మారడం, తత్ఫలితంగా హైదరాబాదు మరియు బెంగళూరు నగరాల అవసరార్థం వచ్చే కూరగాయలు మరెంతో దూరం నుంచి రావలసి వస్తోంది. వాటి ధరలు పెరగడానికి కొద్ది మంది అత్యాశే కారణం. ఆ ఆశకు అందరూ మూల్యం చెల్లించుకోవలసివస్తోంది. 
తరతరాలుగా చక్కగా వ్యవసాయం చేసుకొనే రైతులు ఒక్క సారిగా వచ్చి పడ్డ డబ్బుతో వాళ్ళు ఏం చేసారో ఆలోచించండి. ఖరీదయిన భవనాలు కొని ఉండ వచ్చు. వారి పిల్లలకు మంచి చదువులు చెప్పించి ఉండవచ్చు. ఘనంగా పెళ్ళిళ్ళు చేసి ఉండ వచ్చు. వారిలో కొంత  మంది నడమంత్రపు సిరితో వివిధ వ్యసనాలకు లోనై బికారులుగా మారినట్లు కూడా విన్నాము. అంతే గాని వారెవ్వరూ మరోచోటికి వెళ్లి వ్యవసాయం చేసినట్లు వినలేదు. ఫలితం మంచి రైతులను పోగొట్టుకున్నామన్నది ఎవరూ  కాదనలేని నిజం.
కాబట్టి ప్రజా ప్రతినిధులు అందరూ సాగులో లేని విస్తారంగా ఉన్న ప్రభుత్వ భూములలో మాత్రమే రాజధాని ఏర్పాటు చేసుకోవడం గురించి ఆలోచించి నిర్ణయం తీసుకొవాలి. ఆ చుట్టూ ప్రజలు ఇళ్ళు కట్టుకోవడానికి అనువుగా సాగులో లేని భూములు దొరికేటట్లు వీలు ఉండాలి. భవిష్యత్తులో రాజధాని పెరిగినా భూమి లోటు రాకూడదు. ఇతర వనరులు, ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడం అంతా మనచేతిలో ఉంది. పైపు లైన్ల ద్వారా నీళ్ళు తెచ్చుకో వచ్చు . రోడ్లు వేసుకోవచ్చు. ఇవన్నీ ఒక్క రోజులో సాధ్యం కాకపోయినా కాలక్రమేణా ఏర్పాటు చెసుకొదగ్గవి.
అందరూ ఆలోచించండి!  కోస్తా జిల్లాలలో ఉన్న బంగారంలాంటి సాగు భూములను కాపాడుకుందాం.. 


Monday, May 19, 2014

నాగార్జునపురం

కొత్త ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ఎక్కడ అని ఆత్రంగా ఆంధ్ర ప్రజానీకం ఎదురు చూస్తున్నారు. భౌగోళికంగా అందరికీ సమాన దూరంలో ఉండాలనే ఆలోచనకు దగ్గిరలో గుంటూరు, విజయవాడ ల మధ్య బాగుంటుందనేది సత్యం. నాగార్జున యూనివర్సిటీని ఖాళీ చేయించి అందులో ప్రభుత్వ భవనాలు నిర్మించ వచ్చు అనేది అనువైన ఆలోచనే మరి. ఇరవై అంతస్తుల భవనాలు ఓ ఇరవై కట్టినా అందులో అన్ని విభాగాలు ఇమిడి పోతాయి.
యూనివర్సిటీ వారికీ ప్రతిగా ఎక్కడైనా సరే కావలసినన్ని భవనాలు కట్టించి, ఇతర సాంకేతిక సౌకర్యాలు ఏర్పాటు చేస్తే అంత కన్నా కావలసిందేముంది?
ఆచార్య నాగార్జునకు గౌరవంగా ఈ కొత్త రాజధానికి నాగార్జున పురం అని పేరు పెడితే బాగుంటుంది కదా !

Friday, December 27, 2013

కారు ఘోష 2

కారు ఘోష 2
ఆల్టో లక్ష్మణా  అనుకుంటూ
ఒంటరిగా కాలం గడుపుతున్న నాకు
దొరికింది ఒక తోడు!
తెల్లగా మెరిసి పోతూ నా ప్రక్కనే
నిలబడింది ఒక మారుతీ స్విఫ్ట్ కారు !
మొదటిరోజు మురిసి పోతూ ముద్దుగా అంది
దేశమంతా తిరగ బోతున్నాను నేను !
వింటూ ఫక్కున నవ్వాను నేను !
ఎందుకంటూ అడిగింది నా క్రొత్త తోడు
మోజు కొద్దీ ముందు తిరుగుతారు
కారులో షికారులు !
ఆ తర్వాత పెట్రోలు ఖర్చు చూసి గుండెలు బాదుకుంటూ
మనకు కప్పుతారు ముసుగులు !
రెండేళ్లలో రెండు వేల కిలోమీటర్లు కూడా
వెళ్ళని నేను కాలం గడుపుతున్నాను కారు కవరులో !
కాలానికి బందీలమై కాపురం చేద్దాం రా ప్రియా !